తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశంపై తెలంగాణ ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రితో సోమవారం ఎలాంటి భేటీ జరగడంలేదని స్పష్టం చేశారు.
కిలోమీటర్ ప్రాతిపదికన అధికారుల ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందని తమ వైఖరి స్పష్టం చేశారు. ఒప్పందం కుదిరే వరకు అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయని వివరించారు.
కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలకు వీలు కలుగుతోంది. అయితే ఏపీ నుంచి హైదరాబాదుకు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు బస్సులు తిప్పే విషయంలో తెలుగు రాష్ట్రాల రవాణాశాఖల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఇప్పటికే అధికారుల స్థాయిలో ఇరు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈసారి తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రులు సమావేశమవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పువ్వాడ సమావేశంపై క్లారీటీ ఇచ్చారు.