telugu navyamedia
రాజకీయ

పంజాబీ సింగ‌ర్‌.. కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసే వాలా దారుణ హ‌త్య‌..

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా(28)దారుణ హత్యకు గురయ్యాడు.ఆదివారం ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా..మార్గమధ్యలో ఆయన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ దాడిలో సిద్దూ స్నేహితులకు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయనపై 20 రౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. 

కాగా.. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌.. ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ ఈ హత్య కుట్రలో భాగం అయ్యాడు అని పంజాబ్‌ డీజీపీ వీకే భర్వా మీడియాకు వెల్లడించాడు. బిష్ణోయ్‌ అనుచరుడు గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బార్‌ ఈ హత్యకు కారకుడయ్యి ఉంటాడని చెప్తున్నారు. కిందటి ఏడాది జరిగిన విక్కీ మిద్ధుఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. 

సిద్ధూ 1993 జూన్‌ 17న మాన్సా జిల్లాలోని మూసెవాలలో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చేస్తున్న సమయంలోనే సంగీతం వైపు అడుగులు వేశారు. తర్వాత ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి వచ్చి మంచి రాపర్ సింగర్ అయ్యారు. ఆయనకు మిలియన్ల సంఖ్యలో అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు.

తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు ఇలా హింసను ప్రేరేపించే వాటిని ఎక్కువగా తన పాటల్లో చూపించి వివాదాస్పద గాయకుడిగా ఆయన వార్తలో నిలిచేవారు. ఆయన పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయింది. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్‌ వంటి చిత్రాల్లో సిద్ధూ నటించారు. 2020 జులై కొవిడ్‌ లాక్‌డౌన్‌ టైంలో  తన సెక్యూరిటీ సిబ్బంది దగ్గర‌ ఏకే-47 రైఫిల్‌ని ఫొటోలకు ఫోజులు ఇచ్చినందుకు ఆర్మ్స్‌ యాక్ట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం.. కేసులు నమోదు అయ్యాయి.ఆ టైంలో అరెస్ట్‌కు బయపడి కొన్నాళ్లపాటు పరారీలో ఉన్నాడు అతను.

కాగా.. సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ 2021లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముందు కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్‌లోని మాన్సా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో ఓటమి ఎదురైంది. సిద్ధూ హత్యపై కాంగ్రెస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

కాగా..రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి తెరదించుతూ సిద్ధూ మూసే వాలాతో పాటు 424 మందికి పంజాబ్‌ ప్రభుత్వం శనివారం వీఐపీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

అయితే  ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల‌నే ఒక ప్రాణం బలి తీసుకుందంటూ విప‌క్ష పార్టీలు మండిప‌డుతున్నాయి. 

 

Related posts