telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కదం తొక్కిన గ్రామస్తులు.. సొంతగా రోడ్డు… 19 ఏళ్లగా ఎదురుచూసి..

public voluntarily working for roads

ప్రభుత్వం చేయాల్సిన పని అది, కానీ ఏళ్లగా ఎదురుచూసి చూసి కళ్ళు కాయలు కాశాయి తప్ప, పని జరగలేదు. దీనితో విసిగిపోయిన వారు తామే ఆ పని తలపెట్టి, చేసుకుపోతున్నారు. అభివృద్ధి చేసేశాం అని బీరాలు చెప్పుకు బ్రతుకుతున్న ప్రభుత్వాలకు ఇది చెంపపెట్టు. రానురాను ప్రభుత్వాలు కూడా వారికి ఆదాయం తెచ్చిపెట్టే కార్పొరేట్ వాళ్లకు తొత్తులుగా తప్ప, సామాన్యుల కోసం పనిచేయటం లేదనేదానికి కూడా ఇదొక మచ్చు తునక లాంటి ఉదాహరణ. వివరాలలోకి వెళితే, తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అడ్డంగా ఉన్న కొండపై ప్రభుత్వం రోడ్డు మార్గం నిర్మిస్తుందని ఆ గ్రామస్థులు 19 ఏళ్లుగా ఎదురుచూశారు. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాకపోవడంతో ఇక ప్రభుత్వం తమకు సాయం చేస్తుందన్న ఆశ వారిలో ఆవిరైపోయింది. ఇక కొండ మీదుగా తామే రోడ్డు మార్గాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులు మొదలు పెట్టారు. ఈ రోడ్డు మార్గం నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు అవుతుంది. అయితే, ప్రతిరోజు కొద్ది సేపు ఇక్కడ పని చేస్తే ఎప్పటికయినా ఈ రోడ్డు మార్గం పూర్తి కాకపోతుందా? అన్న ఆశతో పార, కొడవలి, గునపము వంటి పరికరాలను పట్టుకుని కష్టపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని సయూరీ మల్లి గ్రామస్థుల పరిస్థితి ఇది.

గతంలో బిహార్‌లో దశరథ్‌ మాంఝీ అనే వ్యక్తి ఒక్కడే ఏళ్ల తరబడి కష్టపడి పెద్ద కొండను తవ్వేసి తమ గ్రామంలోకి రవాణా సౌకర్యాలు కొనసాగేలా చేశాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న సయూరీ మల్లి గ్రామస్థులు ఈ పనులను మొదలు పెట్టారు. ఈ పనులు మొదలు పెట్టి రెండు వారాలు అవుతోంది. ఇప్పటికీ వారు కొండ పై 150 మీటర్ల మేరకు మట్టిరోడ్డును నిర్మించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ విభజన జరిగిన 2000 సంవత్సరం నుంచి తాము కొండ మీదుగా రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నవంబరు 2017లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర రూ.3.77 కోట్ల ఖర్చుతో రోడ్డు నిర్మిస్తామంటూ శంకుస్థాపన చేశారు. దీనితో తమ గ్రామానికి రోడ్డు సదుపాయం అందనుందని అప్పట్లో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు.

‘రోడ్డు సదుపాయం లేకపోవడంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాము. చాలా ఆలస్యం చేస్తున్నారు. మా గ్రామంలో దాదాపు 115 కుటుంబాలు ఉంటాయి. మా గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఆరోగ్య కేంద్రం ఉంది. పాఠశాలలు 15 కి.మీ దూరంలో ఉంటాయి. పాఠశాలలకు వెళ్లాలంటే చిన్నారులు చాలా అవస్థ పడుతున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఆ గ్రామం నుంచి ఇప్పటికే 50 కుటుంబాలు మరో ప్రాంతానికి వెళ్లిపోయాయి. గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే కనీసం మట్టిరోడ్డయినా వేసుకోవాలని ఈ పనులు చేస్తున్నాం’ అని ఆ గ్రామస్థులు తెలిపారు.

Related posts