telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద .. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు.. !

protest at un office new york

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. వివిధ దేశాలకు చెందిన ప్రజలందరూ కలిసి ప్లకార్డులతో పాక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లలో పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జరిగిన ఆత్మాహుతి దాడితోపాటు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్‌దే బాధ్యత అని ఐరాస ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జెవిష్ అమెరికన్ రిచర్డ్ బెంకిన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దశాబ్దాలుగా భారత్‌లో ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు శక్తిమంతమైన భారత్ వీటిని ఇక చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. భారత్‌కు అండగా అందరూ నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్ ఆటలు ఇక ఎంతమాత్రమూ సాగవన్న విషయం ఆ దేశానికి తెలిసేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు కనుక పాకిస్థాన్‌కు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యుత్తులో తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని, ఎన్నో మరణాలు సంభవిస్తాయని బెంకిన్ హెచ్చరించారు.

ఐరాస కార్యాలయం ఎదుట పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో 26/11 ముంబై దాడులు, పుల్వామా ఆత్మాహుతి దాడి, ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి, 2001లో పార్లమెంటుపై జరిగిన దాడి, 9/11లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి, కాబూల్, అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన దాడులు, లండన్ బస్సు దాడి, జర్మనీ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. అంతేకాదు, పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐపై ఆంక్షలు విధించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి ఆస్తులను ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్‌కు మెమొరాండాన్ని మెయిల్ చేశారు.

Related posts