బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో నటుడు, నిర్మాత నిఖిల్ ద్వివేది మద్దతుగా నిలిచాడు. రియా అరెస్ట్ నేపథ్యంలో నిఖిల్ ఇవాళ ట్విటర్ వేదికగా స్పందిస్తూ “రియా… నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు ఎలాంటి వ్యక్తివో కూడా నాకు తెలియదు. వాళ్లు చెబుతున్నట్టు నువ్వు చెడ్డదానివై యుండొచ్చు, కాకపోవచ్చు. కానీ నీ గురించి జరుగుతున్న ఈ హడావిడి అంతా దారుణంగా ఉంది. ఇది చట్ట విరుద్ధం. నాగరిక దేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదు. ఈ వివాదం ముగిసిన తర్వాత మేము నీతో కలిసి పని చేస్తాం…” అని పేర్కొన్నారు. అయితే నిఖిల్ ప్రకటనపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. “ఆమె డ్రగ్స్ సరఫరా చేస్తున్నందునే అరెస్ట్ అయ్యింది. దయచేసి ఆమెను హీరోను చేసి తర్వాతి తరాన్ని పాడుచేయకండి. నాకు తెలిసి మీరు కూడా బాలీవుడ్ తరపున గొంతువిప్పుతున్నట్టు కనిపిస్తోంది. చాలా త్వరగానే ముసుగు తీసేసినందుకు థాంక్స్” అని పేర్కొన్నాడు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ “కోర్టు ఆమెను దోషిగా గుర్తించిందా? ఒకవేళ దోషిగా తేల్చితే.. ఆమెకు మనం కొంత సమయం ఇచ్చి, దిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆమె మారకపోతే అప్పుడు నా మాట వెనక్కి తీసుకుంటాను. అంతేకానీ.. మీడియా, ప్రజలు వాళ్లంతట వాళ్లే తీర్పులు ఇవ్వడం మానుకోవాలి. తప్పు తేలేవరకు అమాయకురాలేనన్న వాదనకు నేను మద్దతు ఇస్తున్నాను కానీ.. రియాకి కాదు..” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
previous post