telugu navyamedia
సినిమా వార్తలు

ఫేక్ లెటర్స్ నిగ్గు తేల్చండి: నట్టి కుమార్ విజ్ఞప్తి

టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ ఫేక్ లెటర్లు పెట్టిన వారిపై, వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్
నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.

గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లకు సంబంధించి తెచ్చిన జీవో 35ను రద్దు చేయించాలని పూసర్ల బాబు బాబ్జీ అనే వ్యక్తి ఇటీవల ఏపీ హైకోర్టుకెక్కారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్స్ జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ, ఫేక్ లెటర్స్ సృష్టించి జీవో 35 రద్దు విషయంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు.

నా అంగీకారం లేకుండా నా థియేటర్ పైన కూడా ఫేక్ లెటర్లు సృష్టించి, నా థియేటర్ ను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఈ కుట్ర, మోసం వెనుక ఉన్నది విశాఖపట్నం, చోడవరానికి చెందిన పూసర్ల బాబ్జీ అనే వ్యక్తి అయితే దీనికంతా మూలమైన ప్రధాన సూత్రధారి, వేరొకరు ఉన్నారు. పరిశ్రమలో ప్రముఖ నిర్మాత గా ఉంటూ థియేటర్లు లీజు కు తీసుకున్న ఆ టాప్ 1- ఎవరన్నది అందరికీ తెలుసు. తాజాగా విశాఖపట్నం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వారు అక్కడి జాయింట్ కలెక్టర్ ను కలసి, తమ అంగీకారం లేకుండా ఫేక్ లెట్టర్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

అలాగే విజయనగరం, తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి, శ్రీకాకుళం తదితర ప్రాంతాల ఎగ్జిబిటర్స్ సైతం తమకు తెలియకుండా తమ థియేటర్లకు సంబందించిన ఫేక్ లెట్టర్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు ఏపీలోని జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎంతో సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపునకు పూనుకుంటోందని అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ఏపీ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్స్ తమ థియేటర్స్ ను రీ ఓపెనింగ్ చేసుకునేందుకు వీలుగా లైసెన్సులు, ఫైర్ వంటి ఇతర అనుమతులు తెచ్చుకునేందుకు నెల రోజులు సమయం ఇచ్చినందుకు జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

అధికారులు కూడా థియేటర్లకు అనుమతులు ఇచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోకుండా దరఖాస్తు చేసిన 15 రోజులలోగా పరిశీలించి, అనుమతులు మంజూరు చేస్తే బావుంటుందని నా అభిప్రాయం.టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని వేయడం కూడా సినీ పరిశ్రమ పట్ల ఎంత సానుకూలంగా ఉందో తెలియజేసే మరో ఉదాహరణ. మంగళవారానికి కల్లా ఈ కమిటీ ఓ మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అనుకుంటున్నాను.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఛాంబర్ .ఆంధ్రా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం లేదు. అదీకాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్న పెద్ద మనుషులంతా కేవలం స్వార్ధంతో తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు తప్ప ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి అస్సలు ఆలోచిండం లేదు.

ఎంతసేపు తమ బాగు కోసం టిక్కెట్ల ధరలు 400 రూపాయలు, 500 రూపాయలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తప్ప చిన్న నిర్మాతల గురించి వారు పట్టించుకోవడంలేదు. అందుకే ఏపీ ఛాంబర్ ను వేరు చేసి, దామాషా ప్రకారం అక్కడ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత రెండేళ్లకు పైగా హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ కు కోవిడ్ పేరుతో ఎలక్షన్స్ పెట్టడమే లేదు. కేవలం 52 మంది సభ్యులు మాత్రమే ఉన్న ఛాంబర్ కు ఎన్నికలు పెట్టకపోవడం పదవుల్లో ఉన్న వాళ్లే కొనసాగడం కోసం వేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వెంటనే ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.

అందుకోసం 15 రోజుల్లోగా నోటిఫికేషన్ ఇవ్వాలి. జీవో 35 రద్దు కోసం ఫేక్ లెటర్లు పెట్టిన పూసర్ల బాబ్జీ పై చర్య తీసుకోకుండా, ఆ తప్పును, మోసాన్ని ఎత్తిచూపిన నాపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ఛాంబర్ నిన్న పెట్టిన మీటింగ్ లో నిర్ణయించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది పరిశ్రమలోని ఎందరో ఆలోచిస్తున్నారు. సినిమా తీయని పెద్ద మనుషులు మీటింగులో ఈ నిర్ణయాన్ని సమర్దించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, దానిని ఎత్తి చూపుతున్న వారిపై చర్య తీసుకుంటామంటున్నారు. నిజంగా నా వైపు తప్పు ఉంటే చట్ట, న్యాయ పరిధికి లోబడి ఏ చర్య అయినా తీసుకోవచ్చు.

ఇక తెలంగాణ ప్రభుత్వం పెంచిన టిక్కెట్ల రేట్లు చాలా అధికంగా ఉంటూ, చిన్న సినిమాలకు ఎంతమాత్రం అనుకూలంగా లేవు. అంత ఎక్కువ టిక్కెట్ల రేట్లు పెట్టి, చిన్న సినిమాలను ఎవరు చూస్తారు? అందుకే సీఎం కేసీఆర్ గారికి, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ గార్లకు కొత్తగా తెచ్చిన ఆ జీవోలో మార్పులు చేసి, చిన్న సినిమాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అలాగే చిన్న సినిమాల కోసం 5వ షోకు అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాను. అలాగే పేద ప్రజల కోసం తెలంగాణలోని మల్టీఫ్లెక్స్ లలో సీటింగ్ కెపాసిటీలో 10 శాతం టిక్కెట్లను 50 రూపాయలకు కేటాయించాలి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను తగ్గించని పక్షంలో నా చిన్న సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయలేను.

హీరోలకు హీరోయిన్ లకు బాడీ గార్డ్ గా పనిచేసిన ఓ వ్యక్తి నా మీద అవాకులు,చెవాకులు మాట్లాడాడు, అలాంటి బ్రోకర్ కి నేనేంటో తెలుసుకోమని హెచ్చరిక చేస్తున్నాను. సీపీఐ నారాయణ మాటలు చూసి ఆశ్చర్య ము వేసింది, కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆయన టిక్కెట్ల ధరల విషయంపై సీఎం జగన్ పైన చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నాను” అని అన్నారు.

Related posts