telugu navyamedia
సినిమా వార్తలు

‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ

Lovers day Movie Audio Launch images

చిన్నగా క‌న్నుగీటి… రాత్రికి రాత్రే నేష‌న‌ల్ రేంజ్‌లో ఫేమ‌స్ అయిపోయింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఈ క్రేజ్‌తో ఈమె న‌టించిన తొలి మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌`. విడుద‌ల కాకుండానే ఆమెతో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు రెడీ అయ్యారంటే ఆమె సంపాదించుకున్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవాలి. ఈ వింక్ గ‌ర్ల్ ప్రియా ప్ర‌కాష్ న‌టించిన తొలి మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌`ను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. తెలుగులో ఈ చిత్రం `ల‌వ‌ర్స్ డే`గా ప్రేమికుల రోజున విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం…

నిర్మాణ సంస్థ‌: సుఖీభ‌వ సినిమాస్‌
న‌టీన‌టులు: ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: శీను సిద్ధార్థ్‌
కూర్పు: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
క‌థ‌నం: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

క‌థ‌
రోష‌న్ (రోష‌న్‌), ప్రియా వారియ‌ర్‌, గాథా జాన్ అంద‌రూ డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో చ‌దువుతుంటారు. ప్రియ‌ను ఆట‌ప‌ట్టించాల‌ని రోష‌న్ ఆమెను టీజ్ చేస్తాడు. క్ర‌మంగా అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీస్తుంది. వాళ్లిద్ద‌రూ ప్రేమించుకుంటున్న విష‌యం స్కూల్లో అంద‌రికీ తెలిసిపోతుంది. ఒకానొక స‌మ‌యంలో రోష‌న్ ఫ్రెండ్ చేసిన చిన్న త‌ప్పు వ‌ల్ల రోష‌న్ ప్రిన్సిపాల్ ముందు దోషిగా నిలుచోవ‌ల‌సి వ‌స్తుంది. అయితే ఆ స‌మ‌యంలో ప్రియ అత‌నికి స‌పోర్ట్ చేయ‌దు. ముందు నుంచీ అత‌నికి స‌పోర్ట్ చేసే గాథ స‌పోర్ట్ చేస్తుంది. వారిద్ద‌రు క‌లిసి ప్రియ‌ను ఉడికించాల‌ని ప్రేమ‌ను న‌టిస్తారు. అయితే న‌ట‌న‌గా మొద‌లుపెట్టిన వారి ప్రేమ నిజ‌మ‌వ‌సాగుతుంది. ఆ క్ర‌మంలో ఏమైంది? గాథ‌, రోష‌న్ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకున్నారా? లేదా? ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య ప్రేమ ఏమైంది? అనేది ఈ సినిమాలో కీల‌కం.

ప్ల‌స్ పాయింట్లు
– న‌టీన‌టుల న‌ట‌న‌
– అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాలు
– క్లైమాక్స్

మైన‌స్ పాయింట్లు
– సాదాసీదా ఫ‌స్ట హాఫ్‌
– రొటీన్ క‌థ‌నం
– స్కూలో, కాలేజో క్లారిటీ లేని డైలాగ్స్

విశ్లేష‌ణ‌
ప్ల‌స్ ఒన్‌, ప్ల‌స్ టూ అనేది త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్ కిందే లెక్క‌. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది కాలేజీ. అందుకే ఇక్క‌డ మ‌న‌కు యూనిఫార్మ్ లు క‌నిపించ‌వు. అక్క‌డ యూనిఫార్మ్ లు ఉంటాయి. సంభాష‌ణ‌ల్లో కొన్ని చోట్ల కాలేజ్‌, మ‌రికొన్ని చోట్ల స్కూలు అని వినిపించ‌డంలో విష‌యం అదే. స్కూల్లో ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య స‌ర‌దాగా మొద‌లైన ప్రేమ ఎక్క‌డా డెప్త్ గా ఉండ‌దు. ప్రియా కన్ను కొట్టినా, రోష‌న్ ఆమెకు ముద్దు పెట్టినా విడివిడిగా క్లిప్స్ సోష‌ల్ మీడియాలో చూడ్డానికి బాగానే ఉన్నాయి. కానీ సినిమాల్లో వాటిని చ‌క్క‌గా వాడుకోలేక‌పోయారు. కెమిస్ట్రీ సార్‌కీ, మ్యాథ్స్ సార్‌కీ, పీటీ సార్‌కి మ‌ధ్య సాగే డిస్క‌ష‌న్స్ లోనూ న‌వ్వులు రాలేదు. స్కూల్లో జ‌రిగే చిన్న గొడ‌వ పోలీస్ స్టేష‌న్‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందో, ప్రిన్సిప‌ల్‌ను పోలీసులు ఎందుకు భ‌య‌పెడుతారో లాజిక్ ఉండ‌దు. అస‌లు టైటిల్స్ ప‌డేట‌ప్పుడు వ‌చ్చే నేప‌థ్య సంగీత‌మే ప్లెజెంట్‌గా అనిపించ‌దు. సినిమాలో స‌న్నివేశాలు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. అక్క‌డ‌క్క‌డా పాట‌లు బాగానే ఉన్న‌ట్టు అనిపించినా, టోట‌ల్‌గా సంగీతం సినిమాకు ప్ల‌స్ పాయింట్ కాలేక‌పోయింది. క్లైమాక్స్ మాత్రం ఆలోచింప‌జేసేలా ఉంది. అప్ప‌టిదాకా తుళ్లుతూ చూసిన నూరిన్‌ని ప‌తాక సన్నివేశాల్లో అలా చూడ‌లేక‌పోతాడేమో ప్రేక్ష‌కుడు. సినిమా మొత్తం ప్రియా వారియ‌ర్ మీద న‌డుస్తుంద‌ని ప్రేక్ష‌కుడు వెళ్తే నిరాశ త‌ప్ప‌దు. పైగా శాడ్ ఎండింగ్స్ ని ఇష్ట‌ప‌డ‌ని తెలుగువారు ఈ సినిమాను ఎలా ఆద‌రిస్తారో వేచి చూడాల్సిందే.

రేటింగ్: 2/5

Related posts