telugu navyamedia
క్రీడలు వార్తలు

ద్రవిడ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీ షా…

కోచ్‌గా ద్రవిడ్ పర్యవేక్షణలో పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు 2018 అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇండియా-ఎ, అండర్ 19 టీమ్ కోచ్‌గా టాలెంటెడ్ ప్లేయర్లను వెలికితీసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నాడు. అయితే ద్రవిడ్ గురించి షా మాట్లాడుతూ… ‘అండర్-19 ప్రపంచకప్‌కు ముందు కూడా ద్రవిడ్‌ సర్‌తో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లాం. ఆయనెప్పుడు తనలా ఆడాలని బలవంతం చేయరు. ఎవరి ఆటను మార్చుకోవాలని కూడా చెప్పరు. సహజ శైలిలో ఆడాలనే కోరుకుంటారు. నాకు కూడా సహజంగానే ఆడాలని సూచించారు. పవర్ ప్లే ఓవర్స్ ఆడితే నన్ను ఔట్ చేయడం కష్టమని సార్‌కు బాగా తెలుసు. ఆయన ఎక్కువగా మానసిక అంశాలు, ఆటకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే చర్చించేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ ఆటను ఆస్వాదించమని చెప్పేవారు. చేసిన తప్పులు పదే పదే చేస్తే తప్ప వారించేవారు కాదు. ద్రవిడ్ సర్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మైదానం వెలుపల కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మాతో కలిసి డిన్నర్​ కూడా చేసేవారు. అయినప్పటికీ ఆయనంటే కొంచెం భయంగా ఉండేది. ఆయన లాంటి దిగ్గజ క్రికెటర్​ పక్కన కూర్చోవాలనే ప్రతి యువ ఆటగాడి కల. ఇక అండర్-19 ప్రపంచకప్ గెలవడం నా జీవితంలోనే మరిచిపోలేని అనుభూతి. నా కల నేరవేరిన సందర్భం” అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా బీ టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

Related posts