telugu navyamedia
క్రీడలు వార్తలు

బ్యాటింగ్‌లో మార్పులు చేసుకున్న : పృథ్వీ షా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌ 2021) సీజన్‌ ప్రారంభానికి ముందే తన బ్యాటింగ్‌లోని తప్పులు సరిదిద్దుకొని, టెక్నిక్‌లో స్వల్ప మార్పు చేసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీషా తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా( 38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72) చెలరేగిన విషయం తెలిసిందే. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఐపీఎల్ ఫస్టాప్‌లో రాణించిన పృథ్వీ సెకండాఫ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టెస్టులోనూ తనవైఫల్యాన్ని కొనసాగించాడు. దాంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఇక భారత్‌కు తిరిగొచ్చాక తన తప్పులపై దృష్టిసారించిన పృథ్వీ… ఈ క్రమంలోనే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 827 పరుగులు చేసి మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు.

ఇప్పుడు ఐపీఎల్‌ 2021 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన పృథ్వీ తాజాగా మీడియాతో మాట్లాడాడు. తన బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నానని తెలిపాడు. ‘ఐపీఎల్‌ కన్నా ముందు నా బ్యాటింగ్‌లో స్వల్ప మార్పులు చేసుకున్నా. నా తప్పిదాల్ని పూర్తిగా సరిదిద్దుకోవాలని నిశ్చయించుకొని, అందుకోసం బాగా కష్టపడ్డా. రెండు వారాల పాటు స్ట్రెంత్ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ రజినీకాంత్‌ సర్‌, బ్యాటింగ్‌ కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె సర్ వద్ద శిక్షణ తీసుకున్నా. అలా నా బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేసుకొని విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాను’ అని చెప్పుకొచ్చాడు.

Related posts