telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తన బహిష్కరణపై … ప్రశాంత్ కిశోర్(ఆప్ ఎన్నికల వ్యూహ కర్త) …

జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను, నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి పవన్ వర్మను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన పీకే.. నితీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు,మీరు మళ్లీ బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నానని.. దేవుడు మిమ్మల్ని దీవించాలని పేర్కొన్నారు. జేడీయూలో తన చేరికపై నితీశ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రశాంత్ కిశోర్ ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేర్చుకోమంటేనే తాను పార్టీలో చేర్చుకున్నానని నితీశ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఎంత దిగజారుడు అబద్దం చెబుతున్నారు.. మీలాగే నాకు కాషాయ రంగు పులుమాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నారని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. జేడీయూ నేత అయి ఉండి కేజ్రీవాల్ గెలుపు కోసం పనిచేయడమేంటని ఆ పార్టీ నేతలు నితీశ్‌పై ఒత్తిడి తెచ్చారు. దానికి తోడు పౌరసత్వ సవరణ చట్టం(CAA) విషయంలో పదేపదే నితీశ్‌ను ప్రశాంత్ కిశోర్ విమర్శించడాన్ని కూడా వారు సహించలేకపోయారు. ఇదే సమయంలో సీఏఏ,బీజేపీతో పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పవన్ వర్మ నితీశ్‌కు లేఖ రాశారు. దానికి బదులిచ్చిన నితీశ్.. నచ్చకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని తేల్చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్,పవన్ వర్మ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Related posts