కెరీర్ ఆరంభం నుంచి చాలా కాలం పాటు చిన్న చిన్న సినిమాలకే పరిమితం అయినప్పటికీ, ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. ఈ మధ్య వచ్చిన ‘సాహో’తో ప్రభాస్ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న యంగ్ రెబెల్ స్టార్.. తన తర్వాతి ప్రాజెక్టును తెలుగు డైరెక్టర్‌తో చేయబోతున్నాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ఈ మూవీలో శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించగా.. చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ, హిందీలో భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, అతడి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది.
‘సాహో’లో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత అతడు నటిస్తున్న మూవీ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. రొమాంటిక్ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా 1960 దశకం నాటి ప్రేమకథగా తెరకెక్కుతోంది. యూరప్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడని, అది కూడా పునర్జన్మల నేపథ్యంలో వస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో అతడు దొంగగా నటిస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే, దీనిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘జాన్’లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇక, వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అతడు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘జాన్’తో పాటు మరో సినిమా కోసం కథలు వింటున్నాడు. ఈ క్రమంలోనే అతడు సురేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి సహా ఎంతో మందితో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ, క్లారిటీ మాత్రం రాలేదు.
ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్టు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా యంగ్ రెబెల్ స్టార్‌కు వినిపించాడట. ఇది ‘జాన్’ పూర్తయిన తర్వాత పట్టాలెక్కనుందని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఇందులో అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. దీని తర్వాత ప్రభాస్ మూవీ స్క్రిప్ట్ మీద త్రివిక్రమ్ వర్క్ చేయనున్నాడట. ఇందులో ప్రభాస్‌లోని మరో యాంగిల్‌ను చూపిస్తాడట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న దీనిని తెలుగులోనే రూపొందిస్తారని సమాచారం.
“దర్బార్”కు నష్టాలు అన్నది ఓ డ్రామా మాత్రమే… : భారతీరాజా