ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ ఏడాది అల వైకుంఠపురములోతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న పూజా.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ 20వ చిత్రం, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ మూవీల్లో నటిస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దీవాళి చిత్రంలో పూజా నటించనున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో బిజీగా గడిపేస్తోన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే లవ్‌లో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా డేటింగ్ చేస్తున్నట్లు టాక్ నడిచింది. దీనికి తోడు ఈ ఇద్దరు కలిసి పలుమార్లు కెమెరాలకు కూడా చిక్కారు. దీంతో పూజా, రోహన్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై పూజా క్లారిటీని ఇచ్చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమేనని.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో కూడా తెలీదని ఆమె అన్నారు. కాగా బాలీవుడ్ స్టార్ నటుడు వినోద్ మోహ్రా కుమారుడైన రోహన్ మెహ్రా.. సైఫ్ అలీ ఖాన్ నటించిన బజార్ మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో రోహన్.. బాలీవుడ్ నటి తారా సుటారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే.