telugu navyamedia
రాజకీయ

సిరివెన్నెల మ‌ర‌ణం ప‌ట్ల రాజ‌కీయ నాయ‌కులు సంతాపం..

ప్ర‌ముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల రాజ‌కీయ నేత‌లు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.ప్రధాన మంత్రి మోదీ కూడా సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపం తెలియజేస్తూ తెలుగులో ట్వీట్​ చేశారు.”అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి” అని మోదీ అన్నారు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల,పండిత పామరుల హృదయాలను గెలిచారని అన్నారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.

సిరివెన్నెల మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సంతాపం తెలిపారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేష్. ప్రగాఢ సానుభూతి తెలిపారు

తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేసిన ప్రముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి నాకు ఎంతో ఆప్తులు. నేను న‌టించిన చిత్రాల‌కు వారు అద్భుత‌మైన పాట‌లు రాయ‌డం జ‌రిగింది. సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల. ఆయ‌న‌ ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మకు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటూ.. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అన్నారు నందమూరి బాల‌కృష్ణ

ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

సిరివెన్నెల అర్థవంతమైన సాహిత్యం అందించారు. ఆయన లేరని తెలిసి బాధ పడ్డా. సహజ విప్లవ స్వభావం ఉన్న రచయిత. సిరివెన్నెల లేకపోవడంతో కళారంగం చిన్నబోయింది అని సంతాపం తెలిపారు సీపీఐ నేత నారాయణ.

‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. సిరివెన్నెల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు మంత్రి అవంతి.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. “తెలుగు సినీ జగత్తులో… సిరి వెన్నెల లా వెలిగిన సీతారామ శాస్త్రి కలం ఎన్నో అద్భుతమైన పాటలు జాలు వార్చింది. ఆయన భావం, మాట, పాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. నిందా స్తుతి చేసినా, ప్రేమ ఒలక బోసినా, జీవిత సత్యాలను నిష్టూరంగా చెప్పినా… భావం ఏదైనా, పాట ఏదైనా.. అందులో సీతారామ శాస్త్రి ముద్ర బలంగా ఉంది. వారి మరణం సినీ లోకానికి తీరని లోటు. సీతారామశాస్త్రి గారి స్వరాలకు బాలు గారి కంఠ స్వరానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే బాలు లేని లోకంలో నేను రాయలేను అంటూ… బాలు వద్దకే వెళ్ళిపోయారు. సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నాను.” అన్నారు.

“సిరివెన్నెల లేరని తెలిసి ఎంతో బాధపడ్డా. ఆయన రాక.. తెలుగుపాటకు ఊపిరిలూదింది. నలుగురి నోటా పదికాలాలు పలికే పాటలు రాశారు. సాహితీ విరించి సిరివెన్నెల కుటుంబసభ్యులకు సానుభూతి” అని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.

Related posts