హనీ ట్రాప్ ముఠా చరిత్రను తవ్వుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న ముఠా కీలక సభ్యుల సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు తదితరాల్లో నాయకుల శృంగార వీడియోలు అనేకం బయటపడినట్లు సమాచారం. కొందరు అధికారులు కూడా వలపు ముఠాకు చిక్కడం గమనార్హం. రాష్ట్రంలో పదిమందికి పైగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్న కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. గత ఆగస్టు నుంచి జరుగుతున్న హనీట్రాప్ దందాలో సీరియల్ నటి బృందానికి మాజీమంత్రులు, శాసనసభ్యుల రాజకీయ ప్రత్యర్థులకు లక్షలాది రూపాయలు అందించి సహకారం అందించినట్లు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. హనీట్రాప్ వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు ప్రజాప్రతినిదులు, ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసు లేకుండా పరిష్కరించుకోవడానికి పోలీస్‌శాఖను ఆశ్రయిస్తున్నారు.
కీలక నిందితుడు రాఘవేంద్ర, అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయి. ఇంకా అనేకమంది హనీట్రాప్ ఇరుక్కుని డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు, అధికారులను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళలు రాత్రి 10 గంటల అనంతరం మొబైల్‌ఫోన్‌కు ఫోన్ చేసి అర్ధరాత్రి వరకు సంభాషించడం, ఎమ్మెల్యేలు మద్యం మత్తులో ఉండటాన్ని ధ్రువీకరించుకుని మహిళలు రంగంలోకి దిగేవారు. హనీట్రాప్ వలలో పడిన ఎమ్మెల్యేలు, యువతులను ఎమ్మెల్యేలు తరచుగా పిలిపించుకునేవారు. ఈ నీచకృత్యాలను పెట్టుబడిగా పెట్టుకున్న వంచకముఠా వీడియోలు తీసి భారీనగదును ఇవ్వాలని నాయకులను ఒత్తిడి చేసేవారు. రాఘవేంద్ర వద్ద ఏడుకు పైగా మొబైల్స్, 15 సిమ్‌కార్డులను స్వాదీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు.