telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్సిడెంట్ కేసులో… రాజ్ తరుణ్ కు నోటీసులు

Raj-Tarun

సోమవారం అర్ధ‌రాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ రింగు రోడ్డు రహదారి మలుపు వద్ద ప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపురి కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వోల్వో కారు డివైడర్‌ను, పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో కారులో ప్రముఖ సినీ నటుడు రాజ్‌తరుణ్‌ ఉన్నట్టు సీసీ ఫుటేజీలో వెల్లడైంది. ఈ ఘటన గురించి ట్విటర్ ద్వారా రాజ్ తరుణ్ స్పందించాడు. అతివేగంతో వస్తుండగా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ మలుపు వద్ద కారు కంట్రోల్‌ కాకపోవడంతో గోడకు ఢీకొట్టి, గాయాలయ్యాయనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని రాజ్ తరుణ్ వివరించారు. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదమవుతోంది. తాజాగా హీరో రాజ్ తరుణ్‌కు సీఆర్పీసీ 41 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని రాజ్ తరుణ్‌కు అందజేసి.. ఆయన స్టేట్‌మెంట్‌ను నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. రెండు రోజుల్లో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్‌ను దాఖలు చేయనున్నారు. రాజ్ తరుణ్ నుంచి పూర్తి వివరాలను నార్సింగి పోలీసులు సేకరించారు. డ్రంకెన్ డ్రైవ్ చేశాడన్న దానికి సరైన ఆధారాలు లేవన్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేసి ఉంటే తెలిసిపోయేదని.. కానీ.. కారు ఎవరు నడుపుతున్నరో తెలుసుకోవడానికే ఒకరోజు పట్టిందన్నారు. డ్రంకెన్‌డ్రైవ్ చేయలేదని తమకు ఇచ్చిన స్టేట్ మెంట్‌లో రాజ్ తరుణ్ చెప్పాడన్నారు.

Related posts