telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమ‌లాపురం అల్ల‌ర్ల కేసు : పోలీసుల అదుపులో కీల‌క నిందితుడు

*అమ‌లాపురం అల్ల‌ర్ల కేసు
*ప్ర‌ధాన సూత్ర‌దారిగా అన్యం సాయి..
*సాయిని అదుపులోకి విచారిస్తున్న పోలీసులు..
*క‌లెక్ట‌రేట్ ఎదుట పెట్రోల్ పోసుకున్న అన్యం సాయి
*సీసీ పుటేజ్‌లో రికార్డ‌యిన‌ అన్యం సాయి దృష్యాలు.
*అదుపులోకి తీసుకున్నపోలీసులు
*అన్యం సాయిపై గ‌తంలో రౌడీషీట్‌..

అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు. విధ్వంసంపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు.

ఈ నెల 18న ప్రభుత్వం కోన‌సీమ‌ జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళనలకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఆందోళ‌న‌ల‌కు సిద్ధమైంది.

అదే సమయంలో ఈ నెల 19న తెల్లవారుజామున అయినవిల్లి మండలం శానపల్లి లంకగ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించడం కలకలం రేపింది. 20వ తేదీన కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలాపురం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపిస్తే 5 వేల మంది వరకు తరలివచ్చారు.

ఈ నేపథ్యంలోనే అన్యం సాయి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన‌ట్లు సీసీ పుటేజ్‌లో రికార్డ‌వ‌డంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అయితే అత‌డు జ‌న‌సేన‌కు చెందిన వ్య‌క్త‌ని వైసీపీ ఆరోపిస్తుంటే వైసీపీ సానుభూతి ప‌రుడ‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. అమ‌లాపురానికి చెందిన వైసీపీ నేత ఒంటెద్దు వెంక‌ట‌నాయుడికి అనుచ‌రుడిగా తెలుస్తోంది. గ‌తంలో వైసీపీ చెందిన కార్య‌క్ర‌మాల్లోనూ అన్యం సాయి పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి , వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జ‌గ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత వంటి నేత‌ల‌తో ఉన్న పోటోల‌ను జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జ‌న‌సేన‌పై బుర‌ద జ‌ల్లేందుకే అధికార వైసీపీ ఇలా చేస్తోంద‌ని జ‌న సైనికులు ఆరోపిస్తున్నారు.

 

Related posts