telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం: ప్రధాని మోదీ

Modi Mask

లాక్ డౌన్  కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ ఉదయం తన 64వ మన్ కీ బాత్ లో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోవడంలో ఎవరూ విజయం సాధించలేరని అన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి భారతీయులంతా కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని భావి తరాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రతి ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ కరోనా యుద్ధంలో భాగస్వాములయ్యారు. ఎంతో మంది పేదలకు నిత్యమూ సాయపడుతూ ఉన్నారు. మరికొందరు తమ తమ పొలాలను విక్రయించి మరీ, ఈ యుద్ధానికి అవసరమైన నిధులను సేకరిస్తున్నారని అన్నారు. కరోనా నివారణకు, బాధితుడి శరీరంలోని వైరస్ ను తరిమి కొట్టేందుకు అవసరమైన ఔషధాలను ఎన్నో దేశాలకు అందించామని, ఇది భారత్ మాత్రమే సాధించిన ఘనతని మోదీ అభివర్ణించారు.

ప్రపంచ దేశాల పట్ల భారత్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందన్నారు. రోజువారీ ఆదాయంతో పూట గడిపే ఎంతో మంది పరిస్థితి దయనీయంగా మారిందన్న సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకొంటామని చెప్పారు. కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ సమర్థవంతంగా పోరాడుతున్నాయని మోదీ కితాబిచ్చారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.

Related posts