telugu navyamedia
రాజకీయ

ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం తగ్గడం లేదు- మోదీ

* తెలంగాణ ఇచ్చినా అక్కడా తుడిచిపెట్టుకుపోయింది..

*కాంగ్రెస్‌ మరో వందేళ్లు అధికారం వద్దనుకుంటోంది..

*క‌రోనా సమయంలోనూ కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించింది..

ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం మాత్రం తగ్గడం లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్​పై మండిపడ్డారు. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు.

బ్రిటిష్‌వాళ్లు పోయినా వారి విభజించి పాలించే సూత్రాన్ని స్వభావంగా మార్చుకుందని విమర్శించారు. అందుకే టుక్డే టుక్డే గ్యాంగులకు లీడర్‌గా మారిందన్నారు. కాంగ్రెస్‌కు నేనంటే ప్రాణం అని, మోదీ లేకుండా వారు ఒక్క క్షణం కూడా జీవించలేరని విమర్శించారు.

పేదలు కూడా లక్షపధికారుల వర్గంలోకి వచ్చారని ప్రధాని మోదీ అన్నారు. పేదల సంతోషమే దేశానికి బలాన్ని ఇస్తుంది. పేదల ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇళ్లు, టాయిలెట్ ఉంది.సొంతంగా బ్యాంకు ఖాతాను ఉపయోగించుకుంటున్నారు. నిరుపేద తల్లి పొయ్యి పొగ నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు.

దేశంలోని పలు రాష్ట్రాలు కాంగ్రెస్​ను అధికారానికి దూరం చేసి ఏళ్లు గడిచిపోయిందని అన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే పార్టీ.. అక్కడ అధికారంలోకి రాలేకపోయిందని ఎద్దేవా చేశారు.

యూపీ, బీహార్, గుజరాత్ లలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ మరో వందేళ్లు అధికారంలోకి రాలేము అనే ఆలోచనలతోనే వ్యవహరిస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నదని విమర్శించారు. వారు అందుకు సిద్ధమై ఉంటే.. అధికారంలో ఉండటానికి తాము సిద్ధమై ఉన్నామని చెప్పారు. 

కరోనా సమయంలో కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించిందని ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తిని చేసింది వారేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వలస కార్మికులను లాక్‌డౌన్ సమయంలోనూ ఇంటికి పరిమితం చేయకుండా స్వగ్రామాలకు తరలి వెళ్లేలా రెచ్చగొట్టింది. అమాయక కార్మికులకు ఉచితంగా టికెట్లు పంచి, భయపెట్టి సొంత రాష్ట్రాలకు పారిపోయేలా చేసింది.

ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు వాడుకుని ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించేవారు.. ఆయన ఆశయాలను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఆయన కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుంటే ఎందుకు సహకరించదని మోదీ ప్రశ్నించారు.

Related posts