telugu navyamedia
రాజకీయ

20 రోజులు పాటు మోడీ పుట్టినరోజు వేడుకలు

నేడు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 20 రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. నేటితో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు అక్టోబర్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, నదీలను శుభ్రం చేసే కార్యక్రమాలు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు కరోనా వ్యాక్సినేషన్ లాంటి కార్యక్రమాలను బీజేపీ చేపట్టనుంది. సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ పేరుతో బీజేపీ ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగనే కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సులభతరం చేసేలా కార్యక్రమాలు చేపట్టాని బీజేపీ నాయకత్వం.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సులభతరం చేయడం.. పుట్టిన రోజున మోడీకి సరైన బహుమతి అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘రేపు మన ప్రియతమ ప్రధాని పుట్టినరోజు. ఇప్పటికి వ్యాక్సిన్ వేయించుకోని వారు వ్యాక్సిన్ వేయించుకునేలా.. #VaccineSeva చేద్దాం. ఇది ప్రధాని మోడీకి నిజమైన పుట్టినరోజు కానుక’అని మన్సుఖ్ మాండవీయా గురువారం ట్వీట్ చేశారు.

ఇక, 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీ ఆయన పుట్టిన రోజును సేవా దివాస్‌గా జరుపుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా మోడీ 20 ఏళ్ల ప్రజాజీవితం పూర్తి చేసుకున్న సందర్బంగా.. ఈ సారి 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆరోగ్య, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పేదలకు రేషన్ పంపిణీ చేయడానికి సంబంధించి పార్టీ కార్యకర్తలకు సూచనలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే 14 కోట్ల రేషన్ బ్యాగ్‌లను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. వీటిని అవసరమైన వారికి పంపిణీ చేయనున్నారు. ఆ బ్యాగ్‌లపై థ్యాంక్యూ మోడీజీ అని ముద్రించారు. వీటితో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఫోటోతో కూడిన ఐదు కోట్ల పోస్టుకార్డులను దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్ కార్యకర్తలు.. వివిధ పోస్టు ఆఫీసులను నుంచి మోడీ పంపించనున్నారు. అంతేకాకుండా.. వారణాసిలోని భారత్ మాతా ఆలయం దగ్గర 71 వేల దీపాలు వెలిగించబోతున్నారు.

ఇక, మహాత్మా గాంధీ జయంతి(అక్టోబర్ 2) రోజున బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఖాదీతో పాటుగా స్థానిక ఉత్పత్తులను ఉపయోగించేలా జనాలలో అవగాహన కల్పించనున్నారు.

 

Related posts