telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూ కశ్మీర్ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం: మోదీ

modi on jammu and kashmir rule

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్డీయే-2 సర్కారు వచ్చిన 10 వారాల్లోనే దేశ ప్రగతికి ప్రతీకలుగా నిలిచే కీలక నిర్ణయాలను ఎన్నో తీసుకున్నామని అన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు అందులో భాగమేనని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు.

భారతావని మారుతోందని, ప్రతి భారత పౌరుడూ దేశాభివృద్ధి నిమిత్తం తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. ఇచ్చిన మాటకు తాను కట్టుబడివుంటానని అన్నారు. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి దేశంలోని ముస్లిం మహిళలందరికీ అండగా నిలిచామని, వారిలో సాధికారతను పెంచామని చెప్పారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు మెరుగైన చట్టాలను తెచ్చామని గుర్తు చేశారు.ఇండియాలోని రైతులందరికీ పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. వారు తమ పంటల పెట్టుబడి కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా సాయం చేయాలని నిర్ణయించామని నరేంద్ర మోదీ వెల్లడించారు.

Related posts