telugu navyamedia
తెలంగాణ వార్తలు

సమతామూర్తి విగ్రహం ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన మోదీ..

హైద‌రాబాద్‌లోని ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

 తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ ద‌రించి సమతామూర్తి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి సమక్షంలో ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించి లోకార్పణం చేశారు.

తిరునామం, పట్టువస్త్రాలతో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజే రామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగిందని తెలిపారు. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని అన్నారు.

 రామానుజాచార్యుల విగ్రహం జ్జానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు.కులం, మతం, లింగం మధ్య సమానత్వాన్ని మనకు ఆయన ప్రబోధించారని మోడీ గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత భిన్నమైన జనాభా కలిగిన మన దేశం ..సమానత్వాన్ని దృఢంగా నమ్ముతుందని చాటి చెప్పేందుకు ఈ సమతామూర్తి విగ్రహాం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి.’ అని పేర్కొన్నారు.

సమానత్వం, ఐకమత్యానికి చిహ్నంగా నిలిపే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీకి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.

ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. శ్రీరాముడు వ్రత సంపన్నుడని కొనియాడారు. శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడని ప్రశంసించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భరతమాత తలెత్తుకొని చిరునవ్వులు చిందస్తోందని పేర్కొన్నారు.

1000 సంవత్సరాలుగా సమానత్వానికి నిజమైన ప్రతిరూపంగా భగవద్ రామానుజాచార్యులు నిలిచారని అన్నారు. ఆయన బోధనలు కనీసం మరో 1000 సంవత్సరాలు ఆచరించేలా ఈ కార్యక్రమం చూస్తుందని చినజీయర్ ఆకాంక్షించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ సమతామూర్తి ఒక అత్యున్నత సాంస్కృతిక గమ్యస్థానంగా నిలిచి ప్రతీ ఒక్కరూ జీవించేందుకు సమానమైన ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని నిలిపేలా అందరిలో ప్రేరణ కలిగించాలన్నది తమ లక్ష్యం అన్నారు.

పంచలోహాలతో రూపొందించిన సమతా మూర్తి విగ్రహం 1800 కిలోలు కాగా , గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మాణం చేశారు. ఆ వైష్ణవ ఆలయాలను పీఎం మోదీ దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts