telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సూడాన్‌ ఘటనపై … ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి..

pm modi condolence to sudan fire accident deaths

ఖార్తూమ్‌లో సిరామిక్‌ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ విషాద ఘటనలో పలువురు భారతీయులు మృతి చెందిన వార్త విని నేనెంతో దిగ్భ్రాంతికి గురయ్యా. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో బాధితులందరికీ సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయ సహకారాలు అందిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సూడాన్‌ రాజధాని ఖార్తూమ్‌లో సిరామిక్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్‌ పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోగా 130 మంది గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మరో 16మంది గల్లంతైనట్లు పేర్కొంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉండటంతో గుర్తించలేకపోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో పాటు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా భారత రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపుల కోసం +249- 921917471 హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు.

Related posts