telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

22-27 వరకు .. కడపలో కానిస్టేబుల్ అభ్యర్థులకు .. దేహదారుఢ్య పరీక్షలు..

physical tests to canistable selections

కడప మునిసిపల్‌ మైదానంలో కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ఈ నెల 22-27వ తేదీ వరకు నిర్వహించనున్నామని జిల్లా ఎస్‌పి రాహుల్‌ దేవ్‌ శర్మ ప్రకటించారు. ఎస్‌పి ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పోలీసు శాఖ పలు సూచనలు చేసింది. ఎస్‌పి రాహుల్‌ దేవ్‌ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది వరకే ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కడప మునిసిపల్‌ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ చేపట్టామన్నారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌లను, మాజీ సైనికులు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ను, డిశ్చార్జ్‌ సర్టిఫికెట్‌ లను కూడా వెంట తెచ్చుకోవాలని తెలిపారు.

పైన తెలిపిన ధ్రువపత్రాలను రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో పాటు గెజిటెడ్‌ అధికారి సంతకం, పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు తీసుకుని రావాలన్నారు. మొదట నిర్వహించిన ఉత్తీర్ణతశాత ఫలితాల కాపీని తెచ్చుకోవాలని సూచించారు. సెల్‌ ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించామని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద బయోమెట్రిక్‌ విధానం ఉండటం వల్ల అభ్యర్థులు వారి చేతులకు మెహంది, రంగుల లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు.

అభ్యర్థులను అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాతే.. గ్రౌండ్‌ నుండి బయటకు పంపిస్తామని ఎస్‌పి పేర్కొన్నారు. శారీరక ధారుడ్య పరీక్షలకు అభ్యర్థులు సంసిద్ధంగా రావాలని, 25 ఏళ్లు పైబడిన వారు బిపి, గుండె కి సంబంధించిన ఆరోగ్య స్థితిని పరీక్షించుకొని రావాలని తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని అభ్యర్థులు డిస్‌క్వాలిఫై సర్టిఫికెట్‌ కాపీని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు.

దళారుల మాటలను అభ్యర్థులు నమ్మకూడదని, దళారులకు డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా నేరమేనని.. ఇద్దరిపై కేసు నమోదుకు వెనుకాడేది లేదని ఎస్‌పి హెచ్చరించారు. అలాంటి దళారుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. కానిస్టేబుల్‌ దేహధారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామనిఎస్‌పి రాహుల్‌ దేవ్‌ శర్మ పేర్కొన్నారు.

Related posts