విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును సాగర తీరానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటూనే దశల వారీగా విస్తరిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి విశాఖలో సమీక్ష నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టు పనులను పీపీపీ విధానంలోనే అమలు చేస్తామని బొత్స వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని.. త్వరలో టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. తొలి విడతలో భాగంగా 47 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మధురవాడ వరకూ ఉన్న జంక్షన్లపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసినట్లు బొత్స వివరించారు.