ఇటీవల సౌదీ అరేబియాలో చమురు ఉత్పాదక కేంద్రాలపై దాడుల దుష్ప్రభావం భారతీయ మార్కెట్ పై తీవ్రంగా పడింది. వాహనదారుల జేబులు ఖాళీ చేసి పడేస్తోంది. సౌదీ అరేబియాలో దాడుల తరువాత ఎకాఎకిన పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే వాహనదారుల వీపును విమానం మోత మోగిస్తున్నాయి. తాజాగా- మరోసారి పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. పెట్రో ఉత్పత్తుల రేట్లను సవరించినట్లు ఆదివారం చమురు సంస్థలు వెల్లడించాయి. దీని ప్రకారం.. పెట్రోలు లీటర్ ఒక్కింటికి రూ.1.59 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.1.31 పైసలు పెరిగాయి. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. దేశంలో 2017 నుంచి పెట్రోలు, డీజిల్ రేట్లలో రోజువారీ మార్పుల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచీ వరుసగా ఏడో రోజు వాటి ధరలు పెరగడం.. ఇదే మొదటిసారి. ఈ పరిస్థితుల్లో వాహనాలను బయటికి తీయాలంటే బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు.
డ్రోన్ల బాంబు తో సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై దాడులను చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా- బ్యారెళ్ల కొద్దీ పెట్రోలు, ధరలు, ఇతర క్రూడాయిల్.. భగ్గు మంది. పెట్రోలు, డీజిల్ సరఫరాపై ఈ దాడులు పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపాయి. చమురు సరఫరాలో కొరత ఏర్పడటం, దాడుల వల్ల సంభవించిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చమురు ఉత్పాదక సంస్థలు చర్యలకు దిగడం వంటి కారణాల వల్ల పెట్రోలు, డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. అది ఇప్పట్లో ఆగేలా కనిపించకపోవడంమే ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నెల 17వ తేదీన తొలిసారిగా వాటి ధరలు పెరిగాయి. ఆదివారం నాటికి పెరుగుదల పెట్రోల్ లో రూ.1.59, డీజిల్ లో రూ.1.31 పైసలకు చేరుకుంది. మరి కొన్ని రోజుల పాటు దీన్ని భరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. పెట్రోలు, డీజిల్ ధరల నియంత్రణపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తో మాట్లారు. చమురు సరఫరాకు ఢోకా లేనప్పటికీ.. ధరల నియంత్రణపై ఆయన నుంచి ఎలాంటి భరోసా లభించలేదని అంటున్నారు.