అమెరికా అధికారులు పెరూ మాజీ అధ్యక్షుడు అలెజాండ్రో టోలెడోను అరెస్ట్ చేశారని ఆయన్ను త్వరలోనే తమ దేశానికి పంపుతారని పెరూ న్యాయశాఖ మంత్రి విసెంటే జెబల్లోస్ చెప్పారు. భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టోలెడోపై అనేక మంది రాజకీయ నేతలను మోసం చేసిన ఆరోపణలు కూడా వున్నాయి.
2001-06 మధ్య కాలంలో పెరూ అధ్యక్షుడిగా వ్యవహరించిన టలెడో ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను అప్పగించినందుకు ప్రతిఫలంగా బ్రెజిల్ నిర్మాణ సంస్థ ఒడెబ్రెక్ట్ నుండి దాదాపు 2 కోట్ల డాలర్ల లంచాలను అందుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. 2006లో పదవి నుండి ఉద్వాసన పొందిన వెంటనే అమెరికా వెళ్లి అక్కడ ప్రవాస జీవితం గడుపుతున్న టలెడోను తమకు తిరిగి అప్పగించాలని పెరూ ప్రభుత్వం గత ఏడాది లాంఛనంగా విజ్ఞప్తి చేసింది. కాలిఫోర్నియాలో పోలీసులు అరెస్ట్ చేసిన టలెడో తాను ఎటువంటి తప్పూ చేయలేదని పదేపదే చెబుతుండటం విశేషం.