వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి అవలంబిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంపునకు గురయ్యేందుకు ఆస్కారం లేని గ్రామాలు కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జలదిగ్బంధానికి గురయ్యాయని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు. పాలనపై వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని కోరారు. పోలవరం, అమరావతిపై గందరగోళం నెలకొందన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మంత్రి బొత్స రాజధానిపై వ్యాఖ్యలు చేసి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదన్నారు. జమిలి ఎన్నికలు రావొచ్చని నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ అంశం మాజీ సీఎం స్థాయిలో ఉండదని చెప్పారు.