telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైన్ షాపుల వద్ద ఉపాధ్యాయులకు విధులు: పవన్ ఫైర్

pawan-kalyan

లాక్ డౌన్ నిబంధనలను కేంద్రం పాక్షికంగా సడలించడంతో నిన్నటి నుంచి ఏపీలో మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.  చిత్తూరు జిల్లా జనసైనికులతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురువుకు ఉన్న స్థానం దృష్ట్యా ఇలాంటి విధులు సరికాదని హితవు పలికారు.

కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం కోసం ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవడం పద్దతిగా ఉంటుందన్నారు. ప్రజలు కరోనా వ్యాప్తి కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారని తెలిపారు.

ప్రజలు ఆలయాలకు ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్లకుండా పండుగలకు కూడా దూరమయ్యారన్నారు. అదే సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాతే తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ నిర్మించారని ఎద్దేవా చేశారు.

Related posts