telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని ఏ పార్టీలో విలీనం చేయ‌ను ..

తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని, వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా తన ప్రయాణం ఆగదని ..జనసేన ముందుకు సాగుతూనే వుంటుందని.జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోనసీమ జిల్లా మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అభ్యర్థులను చూడొద్దని.. జనసేన నుంచి ఎవరు అభ్యర్ధిగా నిలబడ్డా , వారిలో తనను చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మావాళ్లు తప్పు చేసినా.. తానే దోషిగా నిలబడతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమన్న ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు వుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో గోదావరి జిల్లాల ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని.. ప్రభుత్వంలో లేకపోయినా కౌలు రైతులకు సాయం చేస్తున్నామని ఆయన అన్నారు.

కౌలు రైతుల కుటుంబాలకు ఇప్పటికే కోట్లాది రూపాయల సాయం చేశామని పవన్ గుర్తుచేశారు. రూ. 7 లక్షల బీమా సొమ్ము కౌలు రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఆర్ధికంగా మెరుగైన స్థితిలో నిలబెడతామని పవన్ హామీ ఇచ్చారు. ఇక కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తొలుత స్వాగతించింది తానేనని పవన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో యువతకు ఉఫాధి అవకాశాలు కేవలం జనసేనతోనే సాధ్యమన్న ఆయన.. యువతు కూడా ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు.

ప్రభుత్వం తప్పుచేస్తే సరిచేసే బాధ్యతను యువత తీసుకోవాలన్న పవన్.. ధైర్యం లేకుంటే అరాచకం రాజ్యమేలుతుంద్నారు. ప్రజలు కులాల స్థాయిని దాటి ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు. వైసీపీలోనూ కొందరు మంచివారున్నారని.. తప్పులు సరిదిద్దుకోవాలని వారే ప్రభుత్వానికి చెప్పాలన్నారు. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే అది పులివెందుల వరకు వెళ్తుందన్నారు.

Related posts