ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా విడుదలైన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… తొలి విడత ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు మొదలైనట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు 18 శాతానికిపైగా ఓట్లతో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు కైవసం చేసుకున్నారని.. వెయ్యికిపైగా వార్డుల్లో విజయం సాధించామని తెలిపారు.. అంతేకాదు.. 1700 పైగా పంచాయతీల్లో రెండో స్థానంలో జనసేన అభ్యర్థులు నిలిచారన్నారు పవన్ కల్యాణ్. ఇది కచ్చితంగా మార్పుకు సంకేతంగా అభివర్ణించారు.. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి.. అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారని ప్రశంసించిన జనసేనాని.. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. చూడాలి మరి రెండో విడతలో ఏం జరుగుతుంది అనేది.
previous post
రెడ్లలో జగన్ను గెలిపించుకోవాలన్న పట్టుదల: ఎంపీ జేసీ