సార్వత్రిక అన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఈ రోజు కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనే వీరిద్దరు పర్యటిస్తుండటం విశేషం. ఆదివారం నుంచి పవన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు కూడా ఆయన పర్యటన జిల్లాలో కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రేణుదేశాయ్ కూడా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు రైతుల కుటుంబాలను ఈరోజు ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.
గత ఏడాది ఆగస్టులో ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ లో పెదకడబూరుకు చెందిన రైతు పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో నేడు ఆమె పర్యటించనున్నారు. రేణు దేశాయ్ పర్యటన సందర్భంగా ఆమెకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు సమస్యల కథాంశంతో దర్శకురాలిగా ఓ చిత్రాన్ని ఆమె తెరకెక్కించబోతున్నారు. పవన్ అతని మాజీ భార్య రేణుదేశాయ్ ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.