telugu navyamedia
సినిమా వార్తలు

నాలుగు తరాలుగా సినిమాకు అంకితమైన పాల్ కుటుంబం ..

ఆస్కార్ అవార్డులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు , గౌరవం వున్నాయి . సినిమా రంగంలో వున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు సాధించాలని కలలు కంటారు . ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఉత్తమోత్తమ చిత్రాలు నిర్మించడానికి ప్రయత్నిస్తుంటారు.

ఆస్కార్ అవార్డుల కార్యక్రమం మొదట అమెరికా దేశంలోని లాస్ ఏంజిల్స్ లో 16 మే 1929లో జరిగింది . అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. . ఈ అవార్డుల కోసం ప్రపంచ దేశాలు ఒక్కో చిత్రాన్ని ఎంపిక చేసి నామినేట్ చేస్తాయి . మార్చి 16, 2022న జరిగే 94వ ఆస్కార్ అవార్డుల కోసం భారత దేశం నుంచి ఒక సినిమాను ఎంపిక చేసి పంపించడానికి ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా సినిమా రంగంలోని నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీలో నేను వున్నాను.

ఈ అవార్డు కోసం భారతీయ భాషల నుంచి 14 చిత్రాలు పోటీకి వచ్చాయి .ఎఫ్ .ఎఫ్ .ఐ వీటిని చూడటానికి కలకత్తా నగరంలోని బిజోలి థియేటర్ ను ఎంపిక చేసింది.అక్టోబర్ 18న ఉదయం బిజోలి థియేటర్ యజమాని సురంజన్ పాల్ అందరికీ గులాబి పూలతో స్వాగతం పలికారు. ఆయనను ఎఫ్ .ఎఫ్ .ఐ సెక్రటరీ జనరల్ సుప్రన్ సేన్ నాకు పరిచయం చేశారు . సోమవారం నుంచి శనివారం వరకు ఆస్కార్ కమిటీ సభ్యులకు సురంజన్ , ఆయన సిబ్బంది చేసిన సేవ మర్చిపోలేనిది . ప్రతివారినీ ఆప్యాయంగా పలకరించే తీరు , ఆ వినయం, సినిమా పట్ల ఆయనకున్న అభిమానం నాకెంతో నచ్చాయి . సినిమా రంగంలో 90 సంవత్సరాల నుంచి వారి కుటుంబం ఉందని తెలుసుకున్న తరువాత ఆయన గురించి తెలుగువారికి పరిచయం చేయాలనిపించింది .

ఒకప్పుడు భారతీయ మూకీ చిత్రాల నిర్మాణం కలకత్తా మరియు కొల్హాపురి లో జరిగేది . సినిమా పట్ల అభిరుచితో సురంజన్ పాల్ తాత గారు హరి ప్రియా పాల్ 1930 వ సంవత్సరంలో “ఛబీఘర్ ” అనే సినిమా థియేటర్ ను సినిమాల ప్రదర్శన కోసం నిర్మించారు. సినిమాలను ప్రదర్శిస్తూ ఐదు సంవత్సరాల తరువాత ఆయన ‘బిజోలి’అనే కొత్త థియేటర్ ను ప్రారంభించాడు.

1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది . ప్రపంచమంతా యుద్ధ భయంతో ఉంది. అయినా భారత దేశంలో సినిమా నిర్మాణం , ప్రదర్శన మాత్రం ఆగలేదు. హరి ప్రియా పాల్ 1942లో మే 2న మినార్ అనే మరో థియేటర్ ను ప్రారంభించారు , ఇందులో “నాన్” అనే చిత్రాన్ని మొదటిసారి ప్రదర్శించారు . అయితే మినార్ సినిమా థియేటర్ ప్రారంభించిన కొన్నాళ్లకే యుద్ధ ప్రభావం కలకత్తా నగరం మీద పడింది. సినిమా నిర్మాణంతో పాటు ప్రదర్శన కూడా ఆగిపోయింది.

అప్పటికే జపాన్ సేనలు బర్మాను ఆక్రమించాయి. ఏ క్షణమైనా అవి కలకత్తా కు చేరుకోవచ్చనే ప్రచారం జరిగింది . జపాన్ బాంబుల నుంచి రక్షించుకోవడానికి . నగరంలో సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు దీపాలు వెలిగించకూడదనే ఆంక్ష విధించారు . అలా కలకత్తా ఏడు నెలల పాటు చీకటిలో ఉండిపోయింది . డిసెంబర్ 20, 1942న జపాన్ ఆర్మీ వైమానిక దళానికి చెందినవారు కలకత్తా పై బాంబు దాడి చేశారు. ఆ తరువాత .యుద్ధం నుంచి కోలుకున్నాక మళ్ళీ ” ఛబీఘర్”, “మినార్” , “బిజోలి” థియేటర్లలో మళ్ళీ మొదలయ్యాయి. హరి ప్రియ పాల్ తరువాత ఆయన కుమారుడు సోమనాథ్ పాల్ 1971లో థియేటర్ల బాధ్యతలను చేపట్టారు. 1980లో మూడు థియేటర్ లను ఆధునీకరించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు . సోమనాథ్ కుమారుడే సురంజన్ పాల్. తాత హరిప్రియ పాల్ , తండ్రి సోమనాథ్ లా సురంజన్ పాల్ కు సినిమా అంటే ఎనలేని అభిమానం.

కొంతకాలం పాటు మద్రాస్ ప్రసాద్ ల్యాబ్ లో చేరి సినిమా రంగం గురించి అవగాహన పెంచుకున్నారు. అప్పుడు ఎల్ .వి .ప్రసాద్ గారి కుమారుడు రమేష్ ప్రసాద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. సినిమా రంగంలో నాకు గురువు , మార్గదర్శకుడు రమేష్ ప్రసాద్ అని సగర్వంగా చెబుతాడు. రమేష్ ప్రసాద్ బెంగాలీలో నిర్మించిన “నాగ పంచమి “, బిడాయి “, ” సంధ్య ” సినిమాలు బిజోలి థియేటర్ లోనే విడుదలయ్యాయి . 1990 నుంచి థియేటర్ ల బాధ్యతలను సురంజన్ చూస్తున్నారు . ఆయన . తన కుమారుడు సిద్దార్థ పాల్ సినిమాటోగ్రఫీ లో శిక్షణ తీసుకుంటున్నాడు . అతను కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తానని అంటున్నాడు.

సురంజన్ పాల్ తన థియేటర్ లను మల్టీప్లెక్స్ లుగా మార్చాలనుకున్నాడు . అందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు . అయితే అంతలో డిమానిటైజెషన్ వచ్చింది . అందుకే అది కార్యరూపం దాల్చలేదు . మనసు మార్చుకొని మళ్ళీ సింగల్ థియేటర్ లనే కొనసాగించాలానే నిర్ణయానికి వచ్చారు .
దేశంలో చాలా థియేటర్ లు షాపింగ్ కాంప్లెక్స్ లుగా మారిపోతున్నాయి . పెద్ద థియేటర్ ల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో సురంజన్ పాల్ థియేటర్ లను కొనసాగించాలనే అభిప్రాయంతోనే వున్నారు . తన తాత హరిప్రియ పాల్ , తండ్రి సోమనాథ్ పాల్ వారతత్వాన్ని కొనసాగిస్తాను అని చెబుతున్నారు .
బిజోలి థియేటర్ అంటే తనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు .

ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే “పికు” మరియు “సద్గతి” ప్రత్యేక ప్రదర్శనలను ఈ థియేటర్ లో ఏర్పాటు చేశారు. ప్రభాత్ రాయ్ “‘స్వీట్ పాథోరర్ తాలా” అనే చిత్రం విడుదలై ప్లాటినం జూబ్లీని జరుపుకుంది.
తరుణ్ మజుందార్ సినిమాలు “శ్రీమన్ పృథ్వీరాజ్”, “ఫూలేశ్వరి” మరియు “దాదర్ కీర్తి” ప్లాటినం జూబ్లీలను జరుపుకున్నాయి.

బెంగాలీలో శక్తి సామంత చిత్రం “ఆరాధన” కూడా ఇందులో ప్లాటినం జూబ్లీని జరుపుకుంది .
ఉత్తమ్ కుమార్ నటించిన “ఆనంద ఆశ్రమం”, “సాగరిక”, “దేవా నేవా”, “పాతే హోలో దేరీ”, “హరానో సుర్” ఈ థియేటర్లో ఏడాది పాటు నడిచాయి. కలకత్తాలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా బిజోలి సినిమాలను తప్పనిసరిగా ప్రదర్శిస్తారు.


ఆస్కార్‌ అవార్డు కోసం ఎంపిక చేసే సినిమా కమిటీ సమావేశం 2019 నుంచి ఇక్కడ జరుగుతున్నాయి . ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కమిటీ కి సురంజన్ పాల్ ఆతిధ్యం ఇస్తున్నారు . ఇది తామెంతో గర్వంగా భావిస్తున్నామని అంటారు. గత కమిటీలో కాట్రగడ్డ ప్రసాద్ గారు సభ్యులుగా వున్నారు . ఆయన దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షులుగా వున్నారు , వారితో తనకి ఎంతో అనుబంధం ఏర్పడిందని , ఆయన సలహాలు తీసుకుంటానకి సురంజన్ చెప్పారు.. కరోనా సమయంలో దేశంలో సినిమా పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని , నిర్మాణం జరగలేదు , థియేటర్లలో సినిమాలు విడుదల కాలేదు . కరోనా తగ్గు మొఖం పట్టడంతో ప్రభుత్వం థియేటర్ లను ప్రారంభించుకోవచ్చని చెప్పింది . అందుకే మళ్ళీ థియేటర్లను ప్రారంభించాము అని చెప్పారు.


ఎఫ్ .ఎఫ్ .ఐ సుప్రన్ సేన్ , అనింద్య దాసు గుప్తలు ఆస్కార్ అవార్డుల కోసం తన సేవలను గుర్తించి సర్టిఫికెట్ లను ప్రదానం చేశారని , మన దేశానికి ఆస్కార్ లభిస్తే తాను ఎంతగానో సంతోషిస్తానని సురంజన్ ప్రకటించారు. ఇంట్లో విశ్రాంతి తీసుకునే తన తండ్రి సోమనాథ్ ఇప్పటికీ థియేటర్ లో ఏమి జరుగుతుందని అడుగుతారని చెప్పాడు . సినిమా తమ కుటుంబం లో అంతర్భాగమైందని సురంజన్ పాల్ గర్వంగా చెబుతారు .
– భగీరథ
భారత దేశ ఆస్కార్కమిటీ సభ్యుడు

Related posts