ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అక్కడ ఉండటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ స్పందించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి అక్కడ ఏం పని? అని ప్రశ్నించారు. ఎవరినీ ప్రలోభాలకు గురి చేయకూడదని బెయిల్ షరతుల్లో ఉందని, కానీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు విజయసాయి యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
బెయిల్ పై ఉన్నామనే విషయాన్ని విజయసాయి మర్చిపోకూడదని అనురాధ ఎద్దేవా చేశారు. రూ. 16,97,335 కోట్ల ప్రజల సొమ్మును విజయసాయిరెడ్డి కొట్టేశారని ఆరోపించారు. జగన్ రాజకీయ భవిష్యత్తు బాగుంటే కేసులు మాఫీ అవుతాయనే దురాలోచనలో విజయసాయి ఉన్నారని అన్నారు. మండలిలో కొన్ని చానళ్లను నిలిపివేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.