తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రస్తుత దశలో పంచాయతీ ఎన్నికలు ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ నిలిపివేతకు కోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యతో పాటు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లనన్నింటినీ ఈ రోజు కోర్టు విచారించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన కోర్టు పంచాయతీ ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది.