తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. గత కొద్ది రోజులుగా పనబాక లక్ష్మీ వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికార టీడీపీ లో కూడా చేరతారంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జాతీయస్థాయిలో లౌకిక పార్టీలన్ని ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశారని విమర్శించారు. మాయమాటలు చెప్పి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.