ఇటీవల అమెరికా ప్రకటించిన శాంతి ప్రణాళికకు నిరసనగా తాము ఇజ్రాయిల్, అమెరికాతో అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ ప్రకటించారు. ఈ మేరకు తాము ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలకు సమాచారాన్ని అందించామని ఇక్కడ జరుగుతున్న అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల అత్యవసర బేటీలో చెప్పారు. భద్రతా సంబంధాలతో సహా అన్ని సంబంధాలను తాము ఇకపై కొనసాగించబోమని ఆయన స్పష్టం చేశారు. గత నెల 28న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ప్రకటించిన మధ్యప్రాచ్యం శాంతి పునరుద్ధరణ ప్రణాళికను పాలస్తీనా నిర్ద్వంద్వంగా తిరస్కరించిన విషయం తెలిసిందే.
సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు పాలస్తీనా అథారిటీ ఇటు నెతన్యాహుకు, అటు అమెరికా నిఘా సంస్థ సిఐఎకు లేఖలు రాసిందని ఆయన వివరించారు. జెరూసలేంను ఇజ్రాయిల్‌కు కట్టబెడుతూ రూపొందించిన అమెరికా శాంతి ప్రణాళికను వారు ప్రకటించినపుడు తాము తిరస్కరించామని అబ్బాస్ చెప్పారు. అమెరికా ప్రభుత్వం వివక్షతో కూడిన మధ్యవర్తిగా వ్యవహరించిందన్న ఆయన ఈ శాంతి ప్రణాళికపై నిరసన వ్యక్తం చేస్తూ, సమస్యకు పరిష్కారాన్ని సాధించేందుకు తాను ఐరాస భద్రతా మండలికి వెళ్తానని చెప్పారు.