దేశ ప్రజలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్‌లో జిహాదీ కోసం ఎవరైనా వెళ్తే.. వాళ్లు ఆ ప్రాంతాన్ని మరింత జటిలం చేసినవారవుతారన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థానీలు జిహాదీ కోసం కశ్మీర్ దిశగా వెళ్తే.. ఆ సాకు చూసుకుని భారత్ ఆ ప్రాంతంలో తీవ్ర ఊచకోతకు దిగే అవకాశాలు ఉన్నట్లు ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్ అంశంపై వచ్చే వారం మరోసారి ఐక్యరాజ్యసమితిలోనే ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. తమ దేశం కశ్మీరీల వెంట ఉన్నట్లు ఆయన చెప్పారు.
పాక్ నుంచి ఎవరైనా ఫైట్ చేసేందుకు ఇండియా వెళ్తే.. అప్పుడు కశ్మీరీలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి వారే అవుతారన్నారు. వాళ్లే కశ్మీరీలకు శత్రువులవుతారని ఇమ్రాన్ తమ దేశ జిహాదీలను హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తోర్కమ్ అనే ప్రాంతంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. చిన్న పొరపాటు చేసినా.. అప్పుడు భారత బలగాలు చిత్రహింసకు దిగుతాయన్నారు.