ఇటీవల పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి జవాన్ల మృతికి కారణమైన తమ మాతృదేశంపై దాడి చేయాలని అమెరికాలోని పాక్ వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని ఈ సంస్థ ఖండించింది. భారత ప్రభుత్వం పాక్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని సూచించింది. భారత్‌లోని పాక్ హైకమిషనర్‌ను బహిష్కరించడంతో పాటు పాకిస్తాన్‌లో ఉన్న భారత హైకమిషనర్‌ను వెనక్కి పిలిపించాలని కోరింది. తమ దేశంపై యుద్ధం ప్రకటించి ముష్కరులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రపంచశాంతికి, మానవాళికి పాక్ పెనుముప్పుగా మారిందని మండిపడింది.
బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు. అయితే పాక్ ప్రభుత్వం, సైన్యం వారిని అత్యంత కిరాతకంగా అణచివేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాక్ సైనికుల అత్యాచారాలకు భయపడిన బలూచీ ప్రజలు ఇతర దేశాలకు వలసవెళ్లారని… అజ్ఞాతంలో ఉంటున్న బలూచీనేత ఖాన్ కలాత్ నేతృత్వంలో ప్రవాసంలో బలూచీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భారత్ తమకు మద్దతు ఇవ్వాలని, అలాగే బలూచిస్తాన్‌పై పాక్ ఆక్రమణకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో తమకు సహకరించాలని.. బలూచిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.