తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా మాజీమంత్రి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు సభలోని అన్నిపార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రకటించారు. ఎన్నిక అనంతరం ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమంలో పద్మారావు పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సభాపతి ప్రకటన అనంతరం కేసీఆర్ ఆయనను దగ్గరుండి తీసుకెళ్లి స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టారు. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విపక్ష పార్టీ సభ్యులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.