*తెలంగాణలో ఇవాళ్టి నుంచి పంట కొనుగోలు..
*తెలంగాణ చెక్‌పోస్టుల వద్ద నిఘా..
*ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా అడ్డుకట్ట..
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం.
పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ లో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలనే టీఆర్ ఎస్ సర్కార్ డిమాండ్ చేయడం జరిగింది.
అయితే ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సాధారణ బియ్యంగానే మార్చాలని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. రైతుల నుంచి యాసంగి ధాన్యాన్ని రాష్ట్రమే కొనుగోలు చేసి.. మునుపటి మాదిరిగానే మిల్లులకు పంపనుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది.
ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 36 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరి కోతలు సాగుతున్నాయి.
దీంతోపెద్ద ఎత్తున మార్కెట్లోకి వరి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరి ధాన్యం కొనుగోలు కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ దిశానిర్దేశం చేశారు.దీంతో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద యాసంగి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సీజనులో సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
మరోవైపు..ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ రైతు తన పొలంలో ఏ పంటను వేశారనే సమాచారం వ్యవసాయశాఖాధికారుల వద్ద ఉంది. దీని ఆధారంగా వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
మరో వైపు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వరి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీష్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.