మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు బుధవారం చేవెళ్లలో శ్రీకారం చుట్టనున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకు పార్టీని స్థాపించినట్లు పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 90 నియోజకవర్గాల మీదుగా 400 రోజులు పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్లమేర సాగనుంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిదన్నరకు పాదయాత్ర మొదలై, సాయంత్రం ఆరింటి వరకు యాత్ర కొనసాగనుంది.పాదయాత్ర ముగిసిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు షర్మిల.
ఈ నేపథ్యంలో.. తల్లి విజయలక్ష్మితో కలిసి షర్మిల మంగళవారం ఏపీలోని కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించే క్రమంలో షర్మిల, విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రార్థన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకరినొకరు హత్తుకుని ఓదార్చుకున్నారు. దీంతో వైఎస్సార్ ఘాట్ ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్ సంక్షేమ పాలనంటే రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం. స్వయం ఉపాధి ద్వారా మహిళలను లక్షాధికారులను చేయడం. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాక భర్తీ చేయడం, ప్రైవేట్‌లో భారీగా ఉద్యోగాలు కల్పించడం’’ అని పేర్కొన్నారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకు పార్టీని స్థాపించానన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తెచ్చేందుకు ప్రజలు, అభిమానులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.
పాదయాత్ర మొదటిరోజు షెడ్యూల్ ఇలా..
హైదరాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల వెళ్లనున్న షర్మిల..ఉదయం 10 గంటలకు చేవెళ్లలోని శంకర్‌పల్లి క్రాస్‌రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. చేవెళ్ల బస్టాండ్ సెంటర్ మీదుగా 2.5 కిలోమీటర్లు నడిచి, మధ్యాహ్నం 12.30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు.
అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుని.. సాయంత్రం 3.00 గంటలకు యాత్ర మళ్లీ ప్రారంభిస్తారు. కందవడ గ్రామంలో రచ్చబండ మాట-ముచ్చట కార్యక్రమం ద్వారా గ్రామస్థులతో షర్మిల మాట్లాడతారు . ఎర్రోనికొటల, కందవాడ, గుండాల మీదుగా నారాయన్‌దాస్‌గూడ క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. తొలిరోజు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మొహినాబాద్ మండలం నక్కలపల్లి వద్ద రాత్రికి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బస చేయనున్నారు.