రియాలిటీ షో బిగ్‌బాస్ పేరుతో స్క్రీనింగ్ టెస్ట్ అని పిలిపించి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని; కనుక ఆ షో ను రద్దు చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌లో ఫిర్యాదు అనంతరం వర్సిటీ విద్యార్థి నాయకులు డాక్టర్ కందుల మధు, వేల్పుకొండ వెంకట్, రామక్రిష్ణ, మహేందర్‌లు మాట్లాడుతూ..కొద్ది రోజుల్లో మాటీవిలో ప్రసారం కానున్న రియాలిటీ బిగ్‌బాస్ షో కార్యక్రమం నిమిత్తం సభ్యుల ఎంపిక కోసం మహిళలను స్క్రీనింగ్ టెస్ట్‌ల పేరిట లైంగికంగా వేధిస్తున్నారన్నారు.
ఈ షో కోసం కొంత మందిని సభ్యులుగా చేర్చుకొని, 3 నెలల పాటు పూర్తిగా నిర్భంధంలోకి తీసుకొని రహస్యంగా చిత్రీకరించడంతో పాటు షోలో పాల్గొనే సభ్యులతో బాండ్ పేపర్, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని మహిళలను లైంగికంగా వేధించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంపై పూర్థి స్థాయిలో విచారణ జరిపించి, వేధింపులకు పాల్పడుతున్న షోను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.