ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా తెలిపారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని అన్నారు.
ఢిల్లీకి వచ్చి నాకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్ వివరంగా చెప్పారని పేర్కొన్నారు.
దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరమని యశ్వంత్‌సిన్హా అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు గళం విప్పిన ఒక్క వ్యక్తి కేసీఆర్ అని, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత తెలంగాణ సీఎం సొంతమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఎన్నో ప్రశ్నలు సంధించిందని, కానీ అందులో ఒక్క ప్రశ్నకు సైతం జవాబు రాదన్నారు.
ఎందుకంటే ప్రధాని మోదీ వద్ద ఈ ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. ఎవరైనా చర్చలకు రాకపోతే, స్పందించకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిది కాదని అన్నారు.
తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని.. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతామని యశ్వంత్ సిన్హా తెలిపారు.
నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లుగా పోరాటం అనేది ఎప్పుడూ మన కోసం కాకుండా.. మన భావి తరాల కోసం, దేశం కోసం అనేలా ఉండాలన్నారు. ప్రస్తుతం తాము మొదలుపెట్టిన పోరాటం అలాంటిదేనన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైతే మీరు ఏం చేస్తారని అడిగితే.. రాజ్యాంగం విలువలను కాపాడతానని యశ్వంత్ సిన్హా చెప్పారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని ఇలా ప్రశ్నించారో లేదో అలా ఐటీ, ఈడీ నోటీసులిచ్చారని గుర్తుచేశారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను గతంలో ఎవరూ దుర్వినియోగం చేయలేదని.. తొలిసారి మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్థలను తమ స్వ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపించారు.
సచివాలయం కూల్చివేత కోర్టు ధిక్కరణే: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి