రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. సోమవా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ సిన్హాకి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇప్పటికే ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవడం తెలిసిందే. బలాబలాల దృష్ట్యా ముర్ము గెలుపు లాంఛనమే అయినప్పటికీ, మోదీ తీరుపై విధానపరమైన వ్యతిరేకతలో భాగంగానే విపక్షాలు అభ్యర్థిని నిలిపాయి.
యశ్వంత్ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
యశ్వంత్ సిన్హా బిహార్ పట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు. 1958లో యూనివర్సిటీ ఆఫ్ పట్నాలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. అనంతరం 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 1988లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.
అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో 1990 నవంబర్ 1 నుంచి 1991 జూన్ వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.బీజేపీ ఏర్పాటయ్యాక 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1998-2022 మధ్య కాలలో అటల్‌బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 2002-2004 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే 2018లో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.ఆ తర్వాత బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2021 మార్చి 13న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు యశ్వంత్ సిన్హా. మార్చి 15న పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.