telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

డ్రోన్ తో పులి వేట ప్రారంభించిన అధికారులు…

Tiger

కాగజ్ నగర్ కారిడార్ లో మనుషులను చంపిన పులిని పట్టుకోవడం కోసం అధికారులు కొమురంభీం జిల్లా అడవుల్లో ఆపరేషన్ చేపట్టారు. పులిని పట్టుకోవడానికి ప్రత్యేక టీములను రంగంలోకి దింపారు. జిల్లాలో గత నవంబర్ లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది పెద్ద పులి. దిగిడలో ఒక వ్యక్తిపై దాడి చేసి చంపింది పులి. దీంతో వెంటనే పులిని  పట్టుకుంటామని అధికారులు ప్రకటించారు. దాదాపు రెండు నెలలు దాటింది. పులిని పట్టుకోలేకపోయారు. ఒకవైపు పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతుండగానే  పెంచికల్ పేట మండలం కొండపల్లిలో మరో మహిళపై పంజా విసిరి చంపేసింది పులి. ఇద్దరు ఆదివాసులను పొట్టన పెట్టుకున్న పులిని… పట్టుకోవాలని పట్టుబట్టారు ఆదివాసీలు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పులి అడుగుజాడలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు ఇద్దరిని చంపిన పులులు ఎన్ని అనే విషయాన్ని కనుగొన్నారు. ఇద్దరిపై దాడి చేసింది ఒక్కటే పులిగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఆపరేషన్ కొనసాగుతుండగా.. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను సైతం రంగంలోకి దించారు.ఈ పులి సంచరించే 8 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పులికి మత్తు మందు ఇచ్చేందుకు వందల కొద్దీ ట్రాక్ కెమెరాలు, 14 బోన్లు ఏర్పాటు చేశారు. 40 మంది వరకు యానిమల్ ట్రాకర్స్ పులి ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నారు. పులి సంచరిస్తుందని అనుమానం ఉన్న తలాయి, గుండ్లపల్లి, కందిభీమన్న అటవీ ప్రాంతాల్లో మంచెలు ఏర్పాటు చేశారు. ఈ మంచెలపై నుంచే పులికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచేల మీద నుంచి నిపుణులైన షూటర్స్ తో మత్తు మందు ప్రయోగం చేయనున్నారు అధికారులు. మంచెలపై ఉండి పులి కోసం ఎదురు చూస్తున్నారు మత్తు ఇచ్చే నిపుణులు.. ఇప్పటి కే ఆపరేషన్ జరిగే బేజ్జూరు అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక, తాజాగా డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించారు.. బెజ్జూరు మండలం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పులిని అన్వేషిస్తున్నారు.. డ్రోన్ల సహయంతో పులి జాడ తెలుసుకునే పనిలో పడిపోయారు అధికారులు.

Related posts