తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ఉప్పొంగుతుండడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు, వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో ఖమ్మం నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలను నియంత్రిస్తున్నారు. అలాగే, భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిలిపివేశారు. ఏజెన్సీ ప్రాంతాలకైతే రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉదయం 6 గంటల సమయానికి నీటి మట్టం 59 అడుగులకు చేరుకుంది. 2014 తర్వాత ఇక్కడ ఈ స్థాయిలో నీటిమట్టం పెరగడం ఇదే తొలిసారి. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆరేళ్ల క్రితం సెప్టెంబరు 8న భద్రాచలంలో 56.1 అడుగుల నీటిమట్టం నమోదైంది.