జాతీయ నూతన విద్యా విధానం-2019 ముసాయిదా దేశ వైద్య విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలని సూచించింది. అన్ని వైద్య విద్య కోర్సుల విద్యార్థులకు తొలి ఒకటి రెండేండ్లు కామన్ ఫౌండేషనల్ కోర్సు ప్రవేశపెట్టాలని, తద్వారా నర్సింగ్, డెంటల్ విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ (కోర్సు మధ్యలో చేరిక) ద్వారా ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది. మెడిసిన్, నర్సింగ్, డెంటిస్ట్రీకి సంబంధించిన వివిధ కౌన్సిళ్ల పాత్రను వృత్తిపర ప్రమాణాలు రూపొందించడం వరకే పరిమితం చేయాలని, తనిఖీలు, అక్రెడిటేషన్ పనులను ఇతర ఏజెన్సీలకు అప్పగించాలని ప్రతిపాదించింది. ప్రతిపాదిత ఎంబీబీఎస్ కామన్ ఎగ్జిట్ పరీక్షనే పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షగా పరిగణించాలని సూచించింది. ఫీజు నిర్ణయాధికారాన్ని కళాశాల యాజమాన్యాలకే వదిలివేయాలని, అయితే 50 శాతం మంది విద్యార్థులకు (20 శాతం మందికి పూర్తిగా) ఉపకార వేతనాలు అందించేలా నిబంధనలు తేవాలని కోరింది.
వైద్య విద్యార్థులు మెడిసిన్ (ఎంబీబీఎస్), డెంటిస్ట్రీ (బీడీఎస్), నర్సింగ్ తదితర స్పెషలైజేషన్ కోర్సులు ఎంచుకున్న తర్వాత తొలి ఒకట్రెండేండ్లు అందరికీ కామన్ కోర్సును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అనంతరం నర్సింగ్, డెంటల్, ఇతర కోర్సుల విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకుంటే లాటరల్ ఎంట్రీ ద్వారా అనుమతించాలని ప్రతిపాదించింది. వైద్య విద్య ముసాయిదా ప్రతిపాదనల్లో పాలుపంచుకున్న నారాయణ హెల్త్ చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ.. లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం కల్పించడం అంటే ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కాదని స్పష్టం చేశారు. రెండేండ్ల తర్వాత నర్సింగ్, డెంటల్ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకుంటే, మొదట వారు నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు. అందులో ఉత్తీర్ణులైన తర్వాతే ఎంబీబీఎస్‌లో మిగిలిన మూడేండ్లకు వారిని అనుమతించాలని వివరించారు.
కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రవేశ పరీక్షగానూ పరిగణించాలని ముసాయిదా విధానం సూచించింది. ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చివరలో ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీంతో మళ్లీ వారు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షకు సన్నద్ధం కావాల్సిన భారం తప్పుతుంది. ఈ సమయంలో వారు ఇతర నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలవుతుంది అని పేర్కొంది. అలాగే డెంటల్, ఇతర కోర్సుల వారికి కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్రతిపాదించింది.