ఎన్టీఆర్ బయోపిక్ మొత్తానికి తెరకెక్కింది, నేడు ఆ చిత్రంలోని మొదటి భాగాన్ని విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన వారి నుండి అనుకూల స్పందన రావటంతో ఫుల్ జోష్ లో ఉన్నారు అభిమానులు. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా చేసిన ‘కథానాయకుడు’ చిత్రం ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రావడంతో థియేటర్స్ దగ్గర ఒక రేంజ్ లో సందడి వాతావరణం నెలకొంది. ప్రీమియర్ షోస్ లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బాలకృష్ణ నటన అదుర్స్ అంటున్నారు. తన తండ్రి పాత్రలో బాలకృష్ణ సైకిల్ పై సింపుల్ గా ఎంట్రీ ఇవ్వడం తమకి ఎంతగానో నచ్చిందని చెబుతున్నారు.
ఇక కృష్ణుడిగా .. రావణుడిగా బాలకృష్ణ అద్భుతమైన నటనను కనబరిచారని చెబుతున్నారు. ఇక ‘గుండమ్మ కథ’లో ‘అంజి’గా .. ‘పాతాళభైరవి’లో తోటరాముడు పాత్రలో బాలకృష్ణ అందంగా ఒదిగిపోయి సందడి చేశారని అంటున్నారు. పౌరాణిక .. జానపద చిత్రాలకి సంబంధించిన ఎన్టీఆర్ గెటప్స్ తో బాలకృష్ణ ఆకట్టుకున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి రెస్పాన్స్ వస్తుండటంతో బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.