మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలోని విజయ్ నగర్ పోలీసులు ఓ ఎన్నారైతో పాటు అతడి సోదరుడిని మహిళ ఉద్యోగినులను లైంగికంగా వేధించిన కేసులో గురువారం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఉద్యోగినులకు ప్రమోషన్ ఇస్తామని, దానికి బదులుగా తమ కోరిక తీర్చాలని చాలా కాలంగా సోదరులిద్దరూ వేధింపులకు పాల్పడుతున్నారు. వారి ఆఫర్‌ను తిరస్కరించడంతో ఉద్యోగినులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే జాబ్ నుంచి తొలగించారు. దీంతో బాధితులు విజయ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు సదరు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, సర్వీస్ కన్సల్టింగ్ కంపెనీ యజమానులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు నోటిసులు ఇవ్వకుండా అన్యాయంగా తమను ఉద్యోగం నుంచి తొలగించారని, గత కొన్ని రోజులుగా తమను కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారని, వారి ఆఫర్‌ను కాదనడంతో కక్షపూరితంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఉద్యోగినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ముగ్గురు ఉద్యోగినులను బిజినెస్ మీటింగ్ అని గోవా తీసుకెళ్లిన సోదరులు అక్కడ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ముగ్గురు బాధితులు సోదరులపై తిరగబడ్డారు. దీనిని మనసులో పెట్టుకున్న వారిద్దరూ తిరిగి ఆఫీస్‌కు రాగానే ముగ్గురు ఉద్యోగినులను జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ఓ ఉద్యోగినిని ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు పరుష పదజాలంతో దూషించారు. ఒకవేళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు. గత ఎనిమిది నెలలుగా తాను ఆ కంపెనీలో బిజినెస్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు బాధిత ఉద్యోగిని పేర్కొంది. తమ యజమాని అమెరికాలో ఉంటాడని నెలకు రెండుసార్లు నగరానికి వస్తాడని చెప్పింది. గత ఎనిమిది నెలలుగా అలా నగరానికి వచ్చిన ప్రతీసారి కోరిక తీర్చాలంటూ ఇక్కడ ఉండే తన సోదరుడితో కలిసి తమపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోదరులిద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
సీపీఐ, సీపీఎంలు పార్టీ సిద్ధాంతాలను అమ్ముకున్నాయి: బీజేపీ నేత