telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ మిత్రపక్షాలలో.. పౌరసత్వ చిచ్చు..

august 15th celebrations in J & K with amitsha

పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీ మిత్ర పక్షాల్లోనే విభేదాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు చట్టంగా మారిన సంగతి విదితమే.. ఈశాన్య రాష్ట్రాల్లో.. ముఖ్యంగా అసోంలో ఈ బిల్లును నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పోలీసులకు, వీరికి మధ్య జరిగిన ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు. అధికారులు కర్ఫ్యూ విధించవలసివచ్చింది. అయితే రాజధాని గౌహతి సహా ఇతర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఆదివారం గౌహతిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు కర్ఫ్యూ సడలించారు. అటు-పౌరసత్వ బిల్లును మొదట సమర్థించిన బీజేపీ మిత్ర పక్షం.. అసోం గణ పరిషద్.. తాజాగా యు-టర్న్ తీసుకుని.. దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది. శనివారం సమావేశమైన ఈ పార్టీ సీనియర్ నేతలు.. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కాలని తీర్మానించారు. ఈ చట్టంపై తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను కలవాలని కూడా నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వంలో అసో గణ పరిషద్ కూడా భాగస్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఈ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులున్నారు. సవరించిన పౌరసత్వ బిల్లుకు పార్లమెంటులో మొదట మద్దతు తెలిపిన నేపథ్యంలో.. ఈ పార్టీలోని అనేకమంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల మూడ్ ను పసిగట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని వారు ఆరోపించారు. అసోం పెట్రో కెమికల్స్ లిమిటెడ్ చైర్మన్, బీజేపీ నేత కూడా అయిన జగదీశ్ భూయాన్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రాష్ట్ర చలన చిత్రాభివృద్ది సంస్థ చైర్మన్, సూపర్ స్టార్ జతిన్ బోరా బీజేపీకి బై బై చెప్పారు. ఇటీవలే రవిశర్మ అనే ప్రముఖ నటుడు కూడా కమలం పార్టీ నుంచి వైదొలిగారు. అసోం చిత్ర రంగానికి చెందిన అనేకమంది సెలబ్రిటీలు వీరితో గళం కలిపారు. కాగా-పశ్చిమ బెంగాల్ లో కూడా ఈ బిల్లును నిరసిస్తూ భారీఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు రైలు సర్వీసులను నిలిపివేశారు. శాంతియుతంగా ఉండవలసిందిగా సీఎం మమతా బెనర్జీ ఇఛ్చిన పిలుపును కూడా వీరు ఖాతరు చేయలేదు.

Related posts